- ఘనంగా ముగిసిన పోషణ వారోత్సవాలు
- గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషణపై విస్తృత అవగాహన
- అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలతో సందడి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం అక్టోబర్ 8 (నమస్తే న్యూస్)
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో తిరుమలాయపాలెం మండలం లోని దమ్మాయిగూడెం రైతు వేదిక నందు తిరుమలాయపాలెం ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన 9వ పోషణ వారోత్సవాల మండల స్థాయి ముగింపు కార్యక్రమాన్ని గురువారం దమ్మాయిగూడెం రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో నిర్వహించిన పోషణ వారోత్సవాలను తిరుమలాయపాలెం ప్రాజెక్టు పరిధిలోని ప్రతి సెక్టార్‌లో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల్లో తిరుమలాయపాలెం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీమంతాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు తదితర కార్యక్రమాలను వేడుకగా నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రశంసించారు.
అంగన్వాడీ టీచర్లు వినియోగించే వివిధ యాప్‌లపై ఆమె సవివరంగా అవగాహన కల్పించారు. పోషణ కార్యక్రమాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై చైతన్యం తీసుకురావడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, వేధింపులు, బాల్య వివాహాల వంటి సమస్యలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
దమ్మాయిగూడెం రైతు వేదికలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో శ్రీమంతాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు నిర్వహించి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలను ఘనంగా సత్కరించారు. వారికి పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.
పోషకాహార స్టాళ్లతో ప్రత్యేక ఆకర్షణ
కార్యక్రమంలో వివిధ రకాల పోషకాహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పోషక విలువలు కలిగిన వంటకాలను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
పోషణ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన తిరుమలాయపాలెం ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరదాసు వినోద, ఉపసర్పంచ్ ఉన్నం రాజశేఖర్, డీడబ్ల్యూఓ ప్రమీల, సీడీపీఓ కవిత, సూపర్‌వైజర్లు ఎం. సావిత్రి, పి. లక్ష్మి, టి. సావిత్రి, ఎం.డి. సాదియా, అంగన్వాడీ టీచర్లు ఎస్. పద్మ, జి. మల్సురమ్మ, ఎం. నాగేంద్ర, డి. నాగమణి, ఆశా కార్యకర్తలు రజిని, పద్మకుమారి, ఇప్పల గీత, సాలె విజయరాణి, పదముత్తు స్వరూప, ఏఎన్‌ఎం ఉండేటి మణి, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


