భూహక్కుల కొత్త భరోసా.. భూభారతి
–కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
భూభారతి ద్వారా భూములకు సంబంధించిన రికార్డులను మరింత సులభంగా,పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు అన్నారు.గురువారం మండలంలోని బురహన్‌పురం గ్రామంలో భూభారతి సర్వేను పైలెట్ ప్రాజెక్టుగా మండల తహసీల్దార్ కృష్ణవేణితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐలమల్లు మాట్లాడుతూ..భూ రికార్డుల్లోని లోపాలు,హక్కులకు సంబంధించిన వివాదాలు,రికార్డుల మార్పుల్లో జరుగుతున్న జాప్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భూభారతి కీలక ముందడుగుగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి విధానంలో ఉన్న లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ధరణిలోని లోపాలను సరిచేసి రైతులకు మేలు జరిగేలా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.
భూభారతి సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ సహకారంతో నియోజకవర్గంలోని భూ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించుకునేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల వెంకటమ్మ,మచ్చ వెంకట రామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు..

