Type Here to Get Search Results !

బతుకమ్మ వేడుకలకు కొండసముద్రం ఘాట్ ముస్తాబు.

NAMASTHE NEWS 0

  • బతుకమ్మ వేడుకలకు కొండసముద్రం ఘాట్ ముస్తాబు.
  • పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి.. 
  • ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.
  • మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.





మరిపెడ/అక్టోబర్ 08(నమస్తే న్యూస్): 

తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలకు మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని కొండసముద్రం బతుకమ్మ ఘాట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఘాట్ వద్ద చేపట్టాల్సిన పారిశుధ్య పనులు,పండుగ సందర్భంగా భక్తులు,మహిళలకు కల్పించాల్సిన సౌకర్యాలను మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి గురువారం మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఘాట్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన చైర్‌పర్సన్..బతుకమ్మ వేడుకలకు మహిళలు,యువతులు,చిన్నారులు,ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.ఘాట్ పరిసరాల్లో చెత్తాచెదారం తొలగించడం,ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడం,ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన ఇతర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ..బతుకమ్మ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని..తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత,ప్రకృతితో అనుబంధం,కుటుంబ బంధాలు,పల్లె సంస్కృతికి ప్రతిబింబమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి,మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఒకచోట చేరి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చేసే వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.ప్రకృతిలో సహజంగా లభించే తంగేడు,గునుగు,బంతి,చామంతి తదితర పూలతో బతుకమ్మను పేర్చి,అమ్మవారిని కొలుస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తారు.కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఉండాలని,పాడిపంటలు సమృద్ధిగా పండాలని,గ్రామాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బతుకమ్మను ఆరాధించడం తెలంగాణ ప్రజల సంప్రదాయంగా కొనసాగుతోంది.

కొండసముద్రం భతకమ్మ ఘాట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత..

మరిపెడ ప్రాంతంలో బతుకమ్మ వేడుకలకు కొండసముద్రం ఘాట్ ప్రత్యేక వేదికగా నిలుస్తోంది.ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో మహిళలు,కుటుంబాలు ఇక్కడికి చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేస్తుంటారు.దీంతో పండుగ సందర్భంగా ఘాట్ పరిసరాల్లో పరిశుభ్రత,వెలుతురు,ప్రజలకు అవసరమైన సౌకర్యాలు,రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం ఎంతో కీలకంగా మారింది.బతుకమ్మ వేడుకలు ముగిసిన అనంతరం కూడా ఘాట్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని,పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.పూలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని కూడా అందిస్తున్నందున వేడుకల నిర్వహణలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.ప్రజలు,మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేలా మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చైర్‌పర్సన్ అధికారులకు సూచించారు.పండుగ సమయంలో ప్రజల సహకారంతో ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని,తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ పరిశీలన కార్యక్రమంలో గుగులోత్ లచ్చిరాం, మున్సిపల్ బాధ్యులు పాషా,మణికృష్ణ,వెంకట్ లాల్ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System