Type Here to Get Search Results !

నీళ్లచారు,పొడికారంతో అల్పాహారం...ఇదేనా విద్యార్థుల పట్ల ప్రభుత్వ బాధ్యత?

NAMASTHE NEWS 0

  • హాస్టళ్లలో పరిస్థితులు చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
  • విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్‌తో ఫోన్‌లో మాట్లాడిన సత్యవతి రాథోడ్




నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి): 


మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా గిరిజన బాలుర వసతి గృహం,కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులు,ఆహార నాణ్యత,మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

గిరిజన బాలుర వసతి గృహంలోని వంటగది,భోజన ఏర్పాట్లను పరిశీలించిన ఆమె విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.హాస్టల్‌లో సరైన పడకలు లేకపోవడం,బాత్రూంలు సక్రమంగా లేకపోవడం,ఇతర మౌలిక వసతుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు నాణ్యమైన,పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను కోరారు.

అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన సత్యవతి రాథోడ్ బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.బాలికలకు నీళ్లతో చేసిన చారు,పొడికారంతో అల్పాహారం అందిస్తున్న విషయాన్ని స్వయంగా గమనించిన ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వం కనీస నాణ్యత లేని ఆహారం అందించే పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

విద్యాశాఖ కార్యదర్శికి సమస్యలు.

హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్‌తో సత్యవతి రాథోడ్ ఫోన్‌లో మాట్లాడారు.హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.నూతన హాస్టల్ భవనం పూర్తయినప్పటికీ విద్యార్థులను అక్కడికి తరలించకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు.పూర్తయిన నూతన భవనాన్ని వెంటనే ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.అదేవిధంగా చిన్నగూడూర్‌లో ఇంటర్మీడియట్ స్థాయి విద్య అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థులు తమ సమస్యలపై అధైర్యపడవద్దని,కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సత్యవతి రాథోడ్ సూచించారు.వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం.ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..పేద,గిరిజన విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వం నీళ్ల చారు,పొడికారంతో అల్పాహారం అందించే పరిస్థితికి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

హాస్టళ్లలో పడకలు లేవని,బాత్రూంలు సరిగా లేవని,నాణ్యమైన ఆహారం అందడం లేదని విమర్శించారు.మరోవైపు నూతన భవనాలు పూర్తయినా విద్యార్థులను అక్కడికి తరలించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

విద్యార్థుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదని,క్షేత్రస్థాయిలో వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.చిన్నారుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.హాస్టళ్లలో మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని,పూర్తయిన నూతన భవనాలను వెంటనే ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System