పిల్లలకు స్వచ్ఛమైన, సమతుల్య పోషకాహారం అందించాలి
ఆరోగ్యవంతమైన బాల్యం.. బలమైన భవిష్యత్తుకు పునాది
పోషకాహారం భవిష్యత్ తరాల బలానికి పెట్టుబడి
సర్పంచ్ జడల సుష్మ రమేష్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, అక్టోబర్ 7 (నమస్తే న్యూస్):
తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామం లో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఆహార పోషక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జడల సుష్మ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అందించాల్సిన సమతుల్య ఆహారం, పోషక విలువలు, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందించడంతో పాటు, తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు.
“పిల్లలకు ఇచ్చే పోషకాహారం వారి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల బలానికి పెట్టుబడి” అని సర్పంచ్ జడల సుష్మ రమేష్ పేర్కొన్నారు. “ఆరోగ్యవంతమైన బాల్యం.. బలమైన భవిష్యత్తుకు పునాది. ప్రతి చిన్నారికి స్వచ్ఛమైన, సమతుల్యమైన పోషకాహారం అందించడం మనందరి బాధ్యత” అని ఆమె అన్నారు.
గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా సాగిందని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. చిన్నారులు, తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ టీ. నాగమణి, ఆయా, గర్భిణీ స్త్రీలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

