తల్లిపాలే శిశువుకు తొలి టీకా
హస్నాబాద్ అంగన్‌వాడిలో తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 3 (నమస్తే న్యూస్ )
శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే తొలి రక్షణ కవచమని హస్నాబాద్ గ్రామం సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా హస్నాబాద్ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పుట్టిన తొలి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారమే కాకుండా తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.అంగన్‌వాడి సూపర్వైజర్ లక్ష్మి మాట్లాడుతూ తల్లిపాల ప్రాధాన్యంపై ప్రతి తల్లి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అపోహలను నమ్మకుండా ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా కుటుంబ సభ్యులంతా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్ కొత్తపల్లి సునీత , ఎస్.ఉపేంద్రమ్మ ఆశా కార్యకర్తలు రాధిక,భవాని అంగన్‌వాడి సహాయకురాళ్లు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శిశు సంరక్షణ, పౌష్టికాహారంపై గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు తల్లులు సందేహాలు అడిగి నిపుణుల నుంచి సూచనలు తెలుసుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు స్థానికులు అంగన్‌వాడి సిబ్బందిని అభినందించారు.


