తల్లిపాలే బిడ్డకు అమృతం-6 నెలల వరకు తప్పనిసరి:
మరిపెడ సీడీపీఓ ఎం.ఎల్లమ్మ.
మరిపెడలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 03 (నమస్తే న్యూస్)
తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన అమృతం.బిడ్డ ఆరోగ్యానికి,భవిష్యత్తుకు ఇవే అసలైన పునాది అని మరిపెడ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎం.ఎల్లమ్మ అన్నారు.ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం-1అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం,అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు.గర్భిణీలతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా సీడీపీఓ ఎం.ఎల్లమ్మ మాట్లాడుతూ,పుట్టిన బిడ్డకు పుట్టిన గంటలోపు తల్లి ఇచ్చే పసుపు రంగు ముర్రుపాలు సంజీవనిలాంటివి.వీటిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.ఇవి బిడ్డను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి.పుట్టిన దగ్గర నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.నీళ్లు,ఇతర ఆహారం ఏమీ అవసరం లేదు.6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం కూడా అందించాలి.తల్లిపాల వల్ల బిడ్డ శారీరకంగా,మానసికంగా దృఢంగా ఎదుగుతారు.తల్లికి,బిడ్డకు మధ్య అనుబంధం పెరుగుతుంది.సీజనల్ వ్యాధులు,డయేరియా వంటి సమస్యలు దూరంగా ఉంటాయి" అని సూచించారు.ప్రతి తల్లి తన బిడ్డకు కనీసం 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని,అందులోనూ మొదటి 6 నెలలు ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మరిపెడ సెక్టార్ సూపర్వైజర్ వి.రాజ్యలక్ష్మి,డాక్టర్ స్వామి,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు,గర్భిణీలు,బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొని తల్లిపాలపై ప్రతిజ్ఞ చేశారు.

