Type Here to Get Search Results !

బయ్యారం సొసైటీ అధ్యక్ష పదవిపై అధికారుల ఆదేశాలను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమే మాజీ చైర్మన్ రామగిరి భిక్షం, తుడుం వీరభద్రం ఆరోపణలు

NAMASTHE NEWS 0

బయ్యారం సొసైటీ అధ్యక్ష పదవిపై అధికారుల ఆదేశాలను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమే

మాజీ చైర్మన్ రామగిరి భిక్షం, తుడుం వీరభద్రం ఆరోపణలు



రిపోర్టర్: పిల్లల నరసింహారావు

బయ్యారం, ఆగస్టు 4 (నమస్తే న్యూస్) 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పదవి వ్యవహారంలో అధికారుల ఆదేశాలను అమలు కాకుండా అడ్డుకోవడం అధికార దుర్వినియోగమేనని పీఏసీఎస్ మాజీ చైర్మన్ రామగిరి భిక్షం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకుడు తుడుం వీరభద్రం ఆరోపించారు.

బయ్యారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 20 రోజులుగా సొసైటీ అధ్యక్ష పదవి రద్దు, నూతన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో నెలకొన్న సంక్షోభానికి అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని విమర్శించారు.

కోఆపరేటివ్ శాఖ అధికారులు మాజీ అధ్యక్షుడిపై అనర్హత వేటు వేసి కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని ఆదేశించినప్పటికీ, ఆ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆరోపించారు. దీనివల్ల సొసైటీ పరిపాలన దెబ్బతిని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.జిల్లా సహకార శాఖ అధికారులు తాత్కాలిక అధ్యక్షుడిగా బండారి మల్లయ్యను నియమించిన తర్వాత ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ, ప్రజాప్రతినిధులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బండారి మల్లయ్య నియామక ఉత్తర్వులను ఏ కారణంతో నిలిపివేశారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.అదేవిధంగా ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కూడా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. తక్షణమే సొసైటీ అధ్యక్షుడి నియామక ఉత్తర్వులను అమలు చేసి, సహకార సంఘంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో నేతకాని రాకేష్, ఏపూరి వీరభద్రం, కొదుమూరి నాగేశ్వరరావు, బీరెడ్డి సంగయ్య, బోనగిరి మధు, కేస మునీందర్ తదితరులు పాల్గొన్నారు.కాగా ఈ అంశాలపై సంబంధిత ఎమ్మెల్యే, సహకార శాఖ అధికారులు లేదా ఇతర సంబంధిత పక్షాల అధికారిక స్పందన రావాల్సి ఉంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System