రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే బురద లో అడుగెయ్యాల్సిందే..!
పట్టా కోసం వస్తే బురదే స్వాగతం.. ప్రజలకు నరకయాతన.
జిల్లా కేంద్రంలో అధ్వాన్నంగా దారి.
రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే అవస్థలే
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 4 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే మార్గం అధ్వాన్నంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా కార్యాలయం పరిసర ప్రాంతమంతా బురదమయంగా మారి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.ప్రతిరోజూ భూముల రిజిస్ట్రేషన్లు, పట్టాలు, ఇతర అవసరాల కోసం వందలాది మంది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. అయితే కార్యాలయానికి చేరుకోవాలంటే బురదలో నడుస్తూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పలువురు జారి పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా కేంద్రంలోనే ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి కనీస రహదారి సౌకర్యం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన కార్యాలయానికి వెళ్లే దారే ఇంత దారుణంగా ఉండటం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని మరమ్మతులు చేయడంతో పాటు బురద తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.



