ఆదివాసీ హక్కుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
- ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపు
రిపోర్టర్: పిల్లల నరసింహారావు.
బయ్యారం, ఆగస్టు 4 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ, సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు వర్ష ప్రకాష్ మాట్లాడుతూ, బయ్యారం, కొత్తపేట కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఆదివాసీలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ యువతకు చైతన్యం కల్పించే దిశగా ఉద్యమాలు కొనసాగించాలని అన్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆదివాసీల హక్కులకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జి.ఓ. నెం.3 పునరుద్ధరణతో పాటు ఐటీడీఏ పరిధిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. గార్ల–బయ్యారం ప్రాంతాన్ని భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల్లో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఆదివాసీ యువకుడు, యువతి చైతన్యంతో ముందుకు వచ్చి ఆగస్టు 9 కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో చాట్ల పాపారావు, ఇరుప రాజేష్, మెస్సు రాజశేఖర్, కోర్సా నరేష్, పుల్లయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

