కొండసముద్రం బతుకమ్మ ఘాట్‌ను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి : సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్.
మరిపెడ/అక్టోబర్ 07(నమస్తే న్యూస్):
తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొండసముద్రం బతుకమ్మ ఘాట్‌ను శాశ్వత ప్రాతిపదికన అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కొండసముద్రం బతుకమ్మ ఘాట్ వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం మెట్లు ఏర్పాటు చేసినప్పటికీ,ఘాట్ పరిసర ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పండుగ సమయంలో నామమాత్రపు ఏర్పాట్లకే పరిమితం కాకుండా,ఘాట్ పరిసరాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఘాట్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని,చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.డ్రైనేజీ, విద్యుత్ దీపాలు,తాగునీరు,చెత్త నిర్వహణ,పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.మహిళలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు,బతుకమ్మల నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు.కొండసముద్రం ప్రాంతాన్ని కేవలం బతుకమ్మ పండుగ సమయంలో మాత్రమే వినియోగించే ప్రదేశంగా కాకుండా,మరిపెడ మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా శాశ్వత బతుకమ్మ ఘాట్‌గా,సుందరమైన సాంస్కృతిక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని అబ్దుల్ రషీద్ కోరారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు బతుకమ్మ పండుగకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేలా ఘాట్‌ను అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మరిపెడ బంగ్లా టౌన్ కార్యదర్శి పగిళ్ల అంజి, సహాయ కార్యదర్శి రాసాల యుగంధర్,పానుబోతు ఎంకన్న,అక్కెనపల్లి రాములు,లింగయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

