టేకులపల్లి ప్రభుత్వ పాఠశాల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
డీఈవోకు పీడీఎస్‌యూ వినతిపత్రం.. పాఠశాల సమస్యల పరిష్కారానికి డిమాండ్
రిపోర్టర్: పిల్లల నరసింహారావు.
టేకులపల్లి, ఆగస్టు 4 (నమస్తే న్యూస్) |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన విద్యార్థుల పరస్పర ఘర్షణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యూ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రణయ్ కుమార్, జె. గణేష్ మాట్లాడుతూ, ఐదు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థులు తరగతి గదిలోనే పరస్పరం దాడి చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినప్పటికీ, పాఠశాల యాజమాన్యం సరైన విచారణ చేపట్టలేదని ఆరోపించారు.
సంఘటన అనంతరం సంబంధిత విద్యార్థులకు టీసీలు ఇచ్చి వ్యవహారాన్ని ముగించే ప్రయత్నం చేశారని, మండల విద్యాశాఖాధికారి కూడా ఇప్పటి వరకు పాఠశాలను సందర్శించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాలు, తాగునీటి సమస్య, మరుగుదొడ్ల కొరత, భోజనం చేసేందుకు సరైన వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యార్థుల ఘర్షణ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించి, అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

