ఐదేళ్ల చిన్నారి ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదం.
అరుదైన వ్యాధితో పోరాడుతున్న కశ్విక.
చికిత్స కై ₹50 లక్షల సాయం అవసరం.
దాతల సాయం కోసం ఎదురుచూపు.
తిరుమలాయపాలెం,జూలై 25 (నమస్తే న్యూస్ )
బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రి మంచానికే పరిమితమైంది ఐదేళ్ల చిన్నారి కశ్విక. ప్రతి శ్వాస కోసం పోరాడుతూ ప్రాణాలను కాపాడుకోవడానికి చికిత్స కోసం ఎదురుచూస్తోంది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన కాంపాటి రవీందర్–సృజన దంపతుల కుమార్తె కశ్విక అరుదైన జన్యు సంబంధిత (Genetic) వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఊపిరితిత్తులు క్రమంగా దెబ్బతింటుండటంతో శ్వాస తీసుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది. చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లే ఆమె ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని వైద్యులు తెలిపారు. చిన్నారిని కాపాడాలంటే అత్యవసరంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిందేనని సూచించారు. అయితే ఈ చికిత్సకు సుమారు ₹50 లక్షలు ఖర్చవుతుండటంతో నిరుపేద కుటుంబమైన రవీందర్–సృజన దంపతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కన్నబిడ్డను కాపాడుకోవాలనే తపన ఒకవైపు, భారీ చికిత్స ఖర్చు మరోవైపు వారిని కన్నీటి పర్యంతం చేస్తోంది.
"మా బిడ్డను కాపాడండి... మీ చిన్న సహాయం మా పాపకు కొత్త జీవితాన్ని ఇస్తుంది" అంటూ తల్లిదండ్రులు దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరిని సహాయం చేయాలని వేడుకుంటున్నారు. ఒక్కో చేయూత... ఒక్కో విరాళం... చిన్నారి కశ్విక జీవితంలో కొత్త ఆశను నింపగలదు. మానవత్వంతో ముందుకు వచ్చి ఈ చిన్నారికి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

