- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ తక్షణమే రాజీనామా చేయాలి.
- మండల కాంగ్రెస్ నాయకులు జూపెడ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి
తిరుమలాయపాలెం,జూలై 22 (నమస్తే న్యూస్ )పోటీ పరీక్షల లీకేజీలతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేస్తూ, వారి తరఫున ప్రశ్నిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అదుపులోకి తీసుకోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండల కాంగ్రెస్ నాయకులు జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం రవీందర్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం తిరుమలాయపాలెం మండల కేంద్రం లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పేపర్ లీకేజీల వల్ల కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ఆందోళన చేసిన రాహుల్ గాంధీపై పోలీసులు బలప్రయోగానికి దిగడం సిగ్గుచేటన్నారు.తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అరెస్టులకు, అక్రమ కేసులకు కాంగ్రెస్ శ్రేణులు భయపడేది లేదని, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

