సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు.
రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. రైలు వచ్చే క్షణాల్లోనే రక్షించిన రూరల్ సీఐ అంజలి బృందం.
మహబూబాబాద్, జూలై 22 (నమస్తే న్యూస్): సమయస్ఫూర్తితో స్పందించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. రైలు అత్యంత సమీపానికి చేరుకున్న క్షణాల్లోనే యువకుడిని పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసి మరోసారి పోలీసుల సేవా తత్పరతను చాటిచెప్పారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖలో నైట్ అలర్టింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలికి బుధవారం తెల్లవారుజామున సుమారు 2.44 గంటలకు డీజీ కంట్రోల్ రూమ్ నుంచి అత్యవసర సమాచారం అందింది. మహబూబాబాద్ రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో ఆమె వెంటనే వైర్‌లెస్ ద్వారా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.సీఐ అంజలి నేతృత్వంలో ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైల్వే ట్రాక్ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో షేక్ వసీమ్ (26), తండ్రి అబ్బాస్, స్వస్థలం ఇల్లందు, రైల్వే పట్టాలపై పడుకుని ఉండగా గుర్తించారు. అప్పటికే మణుగూరు ఎక్స్‌ప్రెస్ వేగంగా సమీపిస్తుండటంతో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు చివరి క్షణాల్లోనే అతడిని పట్టాలపై నుంచి బయటకు తీసి సురక్షితంగా రక్షించారు.అనంతరం యువకుడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. తర్వాత అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో అప్పగించారు.ఈ సందర్భంగా రూరల్ సీఐ అంజలి మాట్లాడుతూ, వ్యక్తిగత, కుటుంబ లేదా మానసిక సమస్యలతో ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనలో సమయస్ఫూర్తితో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అభినందించారు.

