పాముకాటుతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి
ప్రభుత్వాన్ని కోరిన భవన నిర్మాణ కార్మిక సంఘం
రామన్నపేట, ఆగస్టు 4 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఉండ్రాతి వెంకన్న పని ప్రదేశంలో పాముకాటుకు గురై మృతి చెందడం బాధాకరమని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే సోములు అన్నారు.మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మునిపంపుల గ్రామంలో వెంకన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గొరిగే సోములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని, విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేబర్ శాఖ ద్వారా అందాల్సిన ప్రమాద బీమా, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ఎక్స్‌గ్రేషియా, ఇతర ఆర్థిక సహాయాలను ఆలస్యం లేకుండా మంజూరు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అలాగే పని ప్రదేశాల్లో కార్మికుల భద్రతకు యజమానులు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన పర్యవేక్షణ చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, కార్యదర్శి బుడ్డ ప్రసాద్, నాయకులు బూడిద ముత్యాలు, బూడిద నర్సింహా, గాదె గౌరీశంకర్, జిట్ట వెంకన్న, బూడిద స్వామి, గట్టు మోహన్, మాస్కు వెంకన్న, గట్టు నగేష్, కార్మికులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

