Type Here to Get Search Results !

తిరుమలాయపాలెంలో ప్రీ ప్రైమరీ పోస్టులపై వివాదం... అర్హులకు అన్యాయం..? పైరవీలకే పెద్దపీటా..?

NAMASTHE NEWS 0

  • తిరుమలాయపాలెంలో ప్రీ ప్రైమరీ పోస్టులపై వివాదం.
  •  అర్హులకు అన్యాయం..?
  •  పైరవీలకే పెద్దపీటా..?




తిరుమలాయపాలెం, జూలై 11 (నమస్తే న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ టీచర్ల నియామక ప్రక్రియ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో తీవ్ర వివాదానికి దారితీసింది. అర్హతలు, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులను పక్కనబెట్టి పలుకుబడి ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.మండలానికి కేవలం మూడు పోస్టులు మాత్రమే మంజూరవగా, వందలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తుది ఎంపికలో అర్హత కంటే పైరవీకే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.బచ్చోడు గ్రామానికి చెందిన ఓ ఎస్సీ మహిళ B.Ed, D.Ed అర్హతలతో పాటు ప్రీ ప్రైమరీ బోధనలో అనుభవం ఉన్నప్పటికీ ఆమెను ఎంపిక చేయలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రిజర్వేషన్ ఉన్నప్పటికీ అవకాశం దక్కకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

మరోవైపు, కేవలం డిగ్రీ అర్హత మాత్రమే ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయని, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు పోస్టులు కేటాయించారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరైందనే ప్రచారం జరుగుతుండటంతో వివాదం మరింత ముదురుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక ధృవీకరణ లేదు.ఈ పరిణామాలు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకోవడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. పారదర్శక నియామకాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ ఉన్నా ఉద్యోగం రాలేదు. పలుకుబడి ఉన్నవారికే అవకాశం దక్కిందని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అయితే ఈ ఆరోపణలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు లేదా ఎంపిక కమిటీ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System