Type Here to Get Search Results !

నాకు ఉండేందుకు ఓ చోటు కల్పించండి'.. నర్సింహులపేట పోలీసులను ఆశ్రయించిన 90 సంవత్సరాల వృద్ధురాలు.

NAMASTHE NEWS 0


  • ఆశ్రయం కోసం పోలీసులను ఆశ్రయించిన 90 ఏళ్ల వృద్ధురాలు.
  • కుమారుల మధ్య ఆస్తి వివాదం.. న్యాయం చేయాలంటూ ఎస్‌ఐకి వృద్ధురాలి వినతి.
  • వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని పోలీసులకి ఫిర్యాదు.




నర్సింహులపేట, జూలై 12 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు బోరోజు లక్ష్మమ్మ కుటుంబ కలహాల కారణంగా తనకు నివాసం కల్పించి న్యాయం చేయాలని కోరుతూ నర్సింహులపేట ఎస్‌ఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు వివరాల ప్రకారం.. తనకు ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారని,వృద్ధాప్యం కారణంగా ఎలాంటి పనులు చేయలేని స్థితిలో తనకు చెందిన 25 గుంటల వ్యవసాయ భూమిని తనను జీవితాంతం చూసుకుంటానని హామీ ఇచ్చిన పెద్ద కుమారుడు తన పేరుమీద నుంచి రాయించుకున్నాడని పేర్కొంది. అనంతరం తనను ఇంటి నుంచి పంపించి భూమిని విక్రయించాడని ఆరోపించింది.ప్రస్తుతం రెండో కుమారుడి వద్ద ఆశ్రయం పొందుతున్నానని, తన పేరుమీద ఉన్న ఇంటి స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు కుమారులు ప్రయత్నిస్తున్నారని వాపోయింది. ఇంటి స్థలం విషయంలో ముగ్గురు కుమారుల మధ్య వివాదం నెలకొనడంతో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో తన ముగ్గురు కుమారులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, తనకు శాశ్వత నివాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని కల్పించాలని ఎస్‌ఐని వేడుకుంది.వృద్ధురాలి ఫిర్యాదును స్వీకరించిన నర్సింహులపేట పోలీసులు కేసును పరిశీలించి, సంబంధిత వారిని పిలిపించి విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System