Type Here to Get Search Results !

నాణ్యతలేని ఇంకుడు గుంతలు.. ప్రజాధనం వృథా?

NAMASTHE NEWS 0

  • నాణ్యతలేని ఇంకుడు గుంతలు.. ప్రజాధనం వృథా?
  • పర్యవేక్షణ లోపంతో తూతూ మంత్రంగా పనులు..!
  • అధికారుల నిర్లక్ష్యంపై మండల ప్రజల ఆగ్రహం


పగుళ్ళు ఏర్పడిన ఇంకుడుగుంత 

నర్సింహులపేట, జూన్ 19 (నమస్తే న్యూస్)ప్రజారోగ్య పరిరక్షణతో పాటు,భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ పనులు నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో నాణ్యతా ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న ఈ పనులు కేవలం పేరుకే జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం నిర్మాణాలు వెలుస్తున్నాయని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.ఇళ్ల వద్ద నుంచి బయటకు వచ్చే వృథా నీరు వీధుల్లో ప్రవహించకుండా భూమిలోకి ఇంకిపోయేలా ఇంకుడు గుంతలను నిర్మించాలనే ప్రభుత్వ ఉద్దేశం ఉన్నప్పటికీ,అనేక చోట్ల పనులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.కొన్ని గ్రామాల్లో తగిన లోతు,వెడల్పు లేకుండా గుంతలు తవ్వడం,అవసరమైన నిర్మాణ సామగ్రిని వినియోగించకపోవడం,పనులు పూర్తికాకముందే బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు ఇప్పటికే దెబ్బతినడం, కొన్ని చోట్ల వర్షపు నీటిని కూడా నిల్వ చేయలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించాల్సిన ఈ గుంతలు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పనుల పురోగతి, నాణ్యతపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రత్యేక విచారణ చేపట్టి, నాణ్యతా లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా పనులు నిర్వహించేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System