Type Here to Get Search Results !

చెరువులను కొల్లగొడుతున్న మట్టి మాఫియా.... పట్టించుకోని అధికారులు.

NAMASTHE NEWS 0


అక్రమ సంపాదన కోసం ప్రకృతి సంపదను దోచేస్తున్న అక్రమ వ్యాపారులు.


అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా సాగుతున్న చెరువు మట్టి దందా.


బంకమట్టి తవ్వకాలతో త్వరగా ఎండిపోతున్న చెరువులు.. ఆందోళనలో రైతులు.


రోజుకు వందల ట్రాక్టర్లతో మట్టి తరలింపు...లక్షల్లో అక్రమ వ్యాపారం.


జేసిబి యంత్రాలతో మట్టిని తోడేస్తున్న వ్యాపారులు.

నర్సింహులపేట, 25 మే (నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో చెరువుల మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పెద్దనాగారం ముత్యాలమ్మ చెరువు, జయపురం అక్కిరాల చెరువు, నర్సింహులపేట పెద్దచెరువుతో పాటు వంతాడుపల్లె, చిల్లంచెర్ల గ్రామాల పరిధిలోని పలు చెరువులు, కుంటల్లో భారీగా బంకమట్టిని తవ్వి తరలిస్తున్న ఘటనలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

చెరువుల కింద సాగు చేసుకుంటున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లోని సారవంతమైన ఒండ్రుమట్టి, జిగుట మట్టిని జేసీబీల సహాయంతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ 100 నుంచి 500 వరకు ట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో వెయ్యికి పైగా ట్రిప్పులు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున మట్టి డంపులు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇటుకల తయారికి అనుకూలమైన జిగుట మట్టికి భారీ డిమాండ్ ఉండటంతో ఇటుక బట్టీల యజమానులు ఒక్క ట్రాక్టర్ మట్టికి రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారం ద్వారా కొందరు వ్యాపారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రకృతి సంపదను కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ మట్టి దందా కొనసాగుతోందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టి తరలింపులు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

చెరువుల్లో అధికంగా బంకమట్టి తవ్వకాల వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు చెరువులు వేగంగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన సారవంతమైన ఒండ్రుమట్టి నేడు వ్యాపార వస్తువుగా మారడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటుక బట్టీల యజమానులు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చెరువులను కాపాడేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System