Type Here to Get Search Results !

తెలంగాణ గానకోకిల బెల్లి లలిత...

NAMASTHE NEWS 0

పాటను పోరాటంగా మార్చిన అమర గాత్రం.

కుల వివక్ష, మద్యం, మహిళలపై హింస, వనరుల దోపిడీలపై గర్జించిన గొంతుక.

లలితక్క 27వ వర్ధంతి ప్రత్యేక కథనం.


రిపోర్టర్.కారంపురి వెంకటేశ్వర్లు(7893556455)

సెంటర్:డోర్నకల్/మరిపెడ.




మరిపెడ, మే 26 (నమస్తే న్యూస్)

“తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో… తడి గొంతులారిపోయే తుమ్మెదాలో…”ఈ ఒక్క పాట చాలు… తెలంగాణ నేలలోని ఫ్లోరైడ్ కన్నీళ్లను, పల్లె ప్రజల దాహాన్ని, అణచివేతను గుర్తు చేయడానికి. ఆ పాట పాడింది ఒక సాధారణ గాయని కాదు… ప్రజల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిలించిన గానయోధురాలు — తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క.

నేడు మే 26. మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన బెల్లి లలితక్క 27వ వర్ధంతి. ఆమె జీవితం ఒక పాట కాదు… అది పోరాట గాథ. ఒక సాధారణ కూలీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి, తన గాత్రాన్ని ప్రజల అస్త్రంగా మార్చుకుని తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.

1974 ఏప్రిల్ 29న యాదాద్రి భువనగిరి జిల్లా నాంచారిపేట గ్రామంలో బెల్లి లలిత జన్మించింది. ఒగ్గుకథ కళాకారుడైన తండ్రి రామయ్య వద్ద నుంచే ఆమెకు జానపద గీతాలపై ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచే పల్లె బాటలో వినిపించే కష్టాలే ఆమె పాటలుగా మారాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆగిపోయినా, జీవితాన్ని మాత్రం ఆపలేదు. భువనగిరిలోని కాటన్ మిల్లులో కార్మికురాలిగా పని చేస్తూ కార్మికుల కష్టాలు దగ్గరగా చూసింది. అదే ఆమెను ఉద్యమ మార్గంలోకి నడిపించింది.



కార్మిక సంఘాలతో అనుబంధం పెంచుకున్న లలితక్క, క్రమంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లే సాంస్కృతిక యోధురాలిగా మారింది. ఆమె పాటల్లో పల్లె దుఃఖం ఉండేది… దోపిడిపై ఆగ్రహం ఉండేది… తెలంగాణ ఆత్మగౌరవం గర్జించేది.

1990ల చివర్లో తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకుంటున్న సమయంలో లలితక్క గళం ప్రజల్లో కొత్త స్పూర్తిని నింపింది. భువనగిరి సభల నుంచి వరంగల్ డిక్లరేషన్ వరకు ఆమె గానం ఉద్యమానికి ఊపిరిగా మారింది. తెలంగాణ కళాసమితి ద్వారా ఊరూరా తిరుగుతూ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరించింది. కేవలం రాజకీయ అంశాలే కాదు… కుల వివక్ష, మద్యం, మహిళలపై హింస, వనరుల దోపిడీ వంటి సామాజిక సమస్యలపై కూడా ఆమె పాటలు ప్రజలను ఆలోచింపజేశాయి.అందుకే ప్రజలు ఆమెను “తెలంగాణ గాన కోకిల”గా గౌరవించారు.




అయితే ఉద్యమ స్వరం బలపడుతున్న కొద్దీ లలితక్కపై ముప్పు కూడా పెరిగింది. గద్దర్‌పై కాల్పులు, ఉద్యమకారులపై దాడుల నడుమ లలితక్క కూడా లక్ష్యంగా మారింది. 1999 మే 26న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత భువనగిరి పరిసర ప్రాంతాల్లోని బావులు, చెరువుల్లో ఆమె శరీర భాగాలు లభించాయి. కిరాతకంగా 17 ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన లలితక్క, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి సాంస్కృతిక అమరవీరురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. 

ఆమె అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. ప్రజల కళ్లల్లో కన్నీరు ఉన్నా… హృదయాల్లో ఆగ్రహం ఉప్పొంగింది. లలితక్కను చంపినా, ఆమె గాత్రాన్ని మౌనింప చేయలేకపోయారు. ఈరోజు కూడా తెలంగాణ పల్లెల్లో, ఉద్యమ సభల్లో, విద్యార్థి ర్యాలీల్లో ఆమె పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.ప్రత్యేక తెలంగాణ సాధన ఆమె కల. కానీ కేవలం రాష్ట్రం రావడమే కాదు… ప్రజాస్వామిక తెలంగాణ రావాలన్నది ఆమె ఆశయం. ప్రజల పాలన, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆమె కలగన్న తెలంగాణ ఇంకా పూర్తి కాలేదని ఉద్యమకారులు గుర్తుచేస్తున్నారు.లలితక్క శరీరాన్ని 17 ముక్కలుగా నరికినా… ఆమె గాత్రాన్ని మాత్రం ఎవ్వరూ చంపలేకపోయారు.

తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం…ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది.ఆ పోరాటం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System