Type Here to Get Search Results !

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై బానోత్ వెంకన్న

NAMASTHE NEWS 0

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై బానోత్ వెంకన్న




నర్సింహులపేట, 22 మే (నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్సై బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం జయపురం గ్రామ శివారులోని ఆకేరు వాగు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. సంబంధిత ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై బానోత్ వెంకన్న మాట్లాడుతూ, ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రకృతి సంపదను కాపాడటం కూడా పోలీసుల బాధ్యతేనని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక రవాణాను ఆదాయ వనరుగా మార్చుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ దందాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల వాగులు, చెరువులు దెబ్బతిని భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు సహకరించే మధ్యవర్తులు, వాహన యజమానులు, డ్రైవర్లు ఎవ్వరినీ ఉపేక్షించబోమని తెలిపారు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలింపులు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ప్రజలు కూడా అక్రమ ఇసుక రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పదంగా ఇసుక తరలింపులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం దాడులు కొనసాగుతాయని, అక్రమ ఇసుక మాఫియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System