Type Here to Get Search Results !

ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడిన జంట.... వారి విగ్రహాలకు ప్రతీయేట పెళ్లిజరిపిస్తున్న యువకుని తల్లిదండ్రులు.

NAMASTHE NEWS 0

 


(నమస్తే న్యూస్, బయ్యారం,మార్చి 27)

యువతి కుటుంబసభ్యులు  ప్రేమకు అడ్డుకట్టలు వేసినా… ఆ ప్రేమను చరిత్రలో నిలబెట్టిన యువకుని తల్లిదండ్రుల మనసు ఎంత గొప్పదో చెప్పే హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్పోడు తండాలో కనిపిస్తుంది. చిత్రంలో కనిపిస్తున్న లాలు, సుక్కమ్మ దంపతులు తమ కుమార్తెతో కలిసి విగ్రహాలకు కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న ఈ దృశ్యం వెనుక ఒక విషాద గాథ దాగి ఉంది.

ఈ దంపతుల కుమారుడు రామ్కోటి ఒక యువతిని ప్రేమించాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ యువతి తల్లిదండ్రులు ఈ ప్రేమకు అంగీకరించలేదు. కుటుంబ అడ్డంకులు, సామాజిక ఒత్తిడులు తట్టుకోలేక రామ్కోటి 2004లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణ వార్తను జీర్ణించుకోలేక ప్రేమించిన యువతి కూడా కొద్ది రోజుల్లోనే బలవన్మరణం చేసుకుంది.

కుమారుడి మృతి దెబ్బను తట్టుకోలేకపోయిన లాలు, సుక్కమ్మ దంపతులు ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ప్రేమను నిలబెట్టాలనే సంకల్పంతో 2005లో తమ ఇంటి ఆవరణలో చిన్న గుడిని నిర్మించారు. ఆ గుడిలో తమ కుమారుడు రామ్కోటి మరియు అతను ప్రేమించిన యువతి విగ్రహాలను ప్రతిష్టించారు.

అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ విగ్రహాలకు సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహిస్తూ, వారి ప్రేమను స్మరించుకుంటున్నారు. కన్నతల్లిదండ్రుల హృదయంలో నిలిచిపోయిన కుమారుడి జ్ఞాపకాలను ఈ విధంగా సజీవంగా ఉంచుకుంటూ… ప్రేమకు శాశ్వత రూపం ఇచ్చారు.ఈ ఘటన గ్రామస్థుల హృదయాలను కదిలించడమే కాకుండా, ప్రేమకు గౌరవం ఇవ్వాలని సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System